ప్రేమోన్మాది

అరెస్టుప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ సైకో, ప్రేమోన్మాది యువతిపై యాసిడ్‌ దాడికి తెగబడిన నిందితుడిని గంటల వ్యవధిలో పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడికి కచ్చితంగా శిక్ష పడుతుందని ఎస్‌పి విద్యాసాగర్‌నాయుడు స్పష్టం చేశారు. శనివారం మదనపల్లె డిఎస్‌పి కార్యాలయంలో ప్రేమోన్మాది నిందితుడు గణేష్‌ను అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా ఎస్‌పి విద్యాసాగర్‌ నాయుడు మాట్లాడుతూ యువతిపై యాసిడ్‌ దాడి, ఆపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని గంటల వ్యవధిలో, జిల్లా దాటకుండా పట్టుకున్నామన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని తెలిపారు. మదనపల్లె పట్టణంలోని వైఎస్‌ఆర్‌ కాలనీలో నివాసముంటున్న శంకారపు మురళి కుమారుడు శంకారపు గణేష్‌ గుర్రంకొండ మండలం, నడిమికండ్రిగ పంచాయతీ, ప్యారంపల్లికి చెందిన జనార్ధన కుమార్తె గౌతమి మదనపల్లిలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదువుకున్నారని తెలిపారు. అప్పటినుంచి ప్రేమ పేరుతో గౌతమిని గణేష్‌ వేదించేవాడని, ఆమె నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలో గౌతమికి తన మేనత్త కుమారుడితో ఈ నెల 7వ తేదీన నిశ్చితార్థం కాగా ఏప్రిల్‌ 29న వివాహం కానుంది. దీన్ని జీర్ణించుకోలేని గణేష్‌ తనకు దక్కని గౌతమి మరెవ్వరికీ దక్కకూడదన్న కక్షతో ఆమెపై పగపెంచుకుని అఘాయిత్యానికి పన్నాగం పన్నాడన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం యాసిడ్‌ కొనుగోలు చేసి గౌతమిపై దాడి చేసేందుకు శుక్రవారం ఉదయాన్నే ప్రారంపల్లికి చేరుకున్నాడని, గౌతమి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఇంట్లోకి చొరబడి ఆమెతో వాగ్వాదానికి దిగాడని పేర్కొన్నారు. ఆపై వెంట తెచ్చుకున్న యాసిడ్‌ నోట్లో పోసే ప్రయత్నం చేయడంతో ఆమె ప్రతిఘటించగా ముఖంపై చల్లాడన్నారు. ఇంట్లో ఉన్న కత్తితో ఆమె మెడ, గొంతు, చేతులపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించగా ఆమెకు రక్త గాయాలయ్యాయని చెప్పారు. తనపై గణేష్‌ దాడిని ప్రతిఘటించిన గౌతమి ప్రాణాలు దక్కించుకునేందన్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ ఘటనలో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలింపు చేపట్టారన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు సంఘటన జరగ్గా, బెంగుళూరుకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న నిందితుడిని మధ్యాహ్నం 3 గంటలకు చాకచక్యంగా పట్టుకున్నామని తెలిపారు. నిందితుడిపై నేరం రుజువయ్యేందుకు అన్ని ఆధారాలు సేకరించామని కచ్చితంగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. నిందితున్ని గంటల వ్యవధిలో అరెస్టు చేసేందుకు సహకరించిన డిఎస్‌పి కొండయ్య నాయుడు, సిఐలను ఎస్‌పి అభినందించారు. నిందితుడిపై ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ చేపట్టాలి – ఐద్వా రాష్ట్ర నాయకులు సాయిలక్ష్మి గౌతమిపై యాసిడ్‌ దాడి చేసిన నిందితుడిపై ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ జరిపి, వెంటనే కఠిన శిక్ష అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర నాయకులు సాయిలక్ష్మి, జిల్లా కన్వీనర్‌ భాగ్యమ్మ డిమాండ్‌ చేశారు. శనివారం వారు ఘటనా స్థలం ప్యారంపల్లిని సందర్శించి ఏ విధంగా దాడి జరిగిందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరాలు జరిగినప్పుడు సానుభూతి చూపడం కాదని నేరాలను నివారించే చర్యలను చేపట్టాలని తెలిపారు. ప్రేమ పేరిట జరిగిన హత్యాయత్నాన్ని, యాసిడ్‌ దాడిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి పరామర్శలకు మాత్రమే పరిమితమైతే సరిపోదని, ఆడపిల్లల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై, యువత, పిల్లలపై పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు, దాడులతో తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పుకునే వాతావరణం కూడా లేకపోవడం దారుణమన్నారు. నేరాలు పెరగడానికి కారణాలేమిటో విశ్లేషించి, వాటి నివారణకు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నామమాత్రపు ఆలోచన కూడా చేయకపోవడం, బాధ్యత వహించక పోవడం విచారకరమన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టేందుకు నిపుణులతో అద్యయనం చేయడానికి ఓ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలన్నారు. నిధుల కేటాయింపు జరగాలని, మహిళా కమిషన్‌ నెలవారీ సమస్యల పరిశీలన నివేదిక ఇచ్చే విధంగా హైదరాబాద్‌ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఐద్వా సభ్యులు రెడ్డి ప్రసన్న, ఎం గాయత్రి తదితరులు పాల్గొన్నారు.మహిళలకు రక్షణ కల్పించాలి : ఐద్వా మహిళలకు రక్షణ కల్పించి, గౌతమి పై యాసిడ్‌ దాడికి పాల్పడిన సైకో గణేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక విజయనగర్‌ కాలనీలో ఐద్వా, ఎఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ, డ్వాక్రా సంఘాల మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కన్వీనర్‌ భాగ్యమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసి గౌతమిపై యాసిడ్‌ దాడి చేసిన సైకో గణేష్‌ను వెంటనే కఠిన శిక్ష విధించాలని కోరారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే కాలంలో మహిళలపై దాడి చేయాలంటే వణుకు పుట్టేలా శిక్షలు అమలు చేయాలన్నారు. బాధితురాలైన గౌతమి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా సభ్యులు రెడ్డి ప్రసన్న, జి.గాయత్రి, లక్ష్మీదేవి, ఎఎన్‌ఎం నూర్జహాన్‌, ఆశ పుణ్యవతి పాల్గొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నిరసన రాయచోటి టౌన్‌ : యాసిడ్‌ దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని శనివారం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రామాంజులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో గౌతమి అనే యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డ ప్రేమో న్మాది గణేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేశారు. బాధితురాలు గౌతమిని ప్రేమ పేరుతో వేధించి యాసిడ్‌ దాడికి పాల్పడ్డ నిందితుడిని నడిరోడ్డుపై ఉరి తీయాలని, రాష్ట్రంలో మహిళ హోం మంత్రి అని చెప్పుకోవడానికి తమకు సిగ్గుచేటుగా ఉందని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ భాగ్య లక్ష్మి ఆరోపించారు. దిశా, నిర్భయ చట్టాలు దేశంలో ఉన్నా మహిళలకు ఏమాత్రం భద్రత కల్పించడం లేదన్నారు. బాధితురాలను మహిళా హోంమంత్రి పరామర్శించకపోవడం బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళ హోం మంత్రిగా ఉందని ధైర్యంగా ఉండాల్సిన మహిళలు నేడు ఆందోళన చెందాల్సిన అవసరం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా మహిళలపై దాడులు ఆగలేదని, మహిళల భద్రత చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలిచి రూ. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు. పుల్లంపేట : గౌతమిని ప్రేమ పేరుతో కత్తితో పొడిచి యాసిడ్‌ దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా నాయకులు శ్రీలక్ష్మి డిమాండ్‌ చేశారు. ప్రేమి కుల రోజు ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్ర తలు విగాథం కలిగించేలా ఉన్నాయని తక్షణమే హోంమంత్రి చర్యలు తీసుకొని రాష్ట్రంలో మహిళల శాంతి భద్రతలకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఇలాంటి సంఘటనల వల్ల ఆడపిల్లల తల్లి దండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారని మహిళలను ఇంటి నుంచి బయటకు పంపించాలంటే తల్లి దండ్రులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు వనజ కుమారి పాల్గొన్నారు.

➡️